అనకాపల్లిలో గంజాయి స్మగ్లింగ్.. రూ.38 లక్షల విలువైన సరుకు సీజ్

by Naga Rani Yarlagadda |

అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్షరాలా 38.50 లక్షల రూపాయల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.

అనకాపల్లిలో గంజాయి స్మగ్లింగ్.. రూ.38 లక్షల విలువైన సరుకు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా చోడవరం పోలీసులు మత్తు దందాలపై ఉక్కుపాదం మోపారు. శనివారం మధ్యాహ్నం జరిపిన తనిఖీల్లో భారీగా లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. చోడవరం ఎస్ఐ బి. జోగారావుకు అందిన ముందస్తు సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం గౌరీపట్నం జంక్షన్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక వ్యక్తిని తనిఖీ చేయగా.. నిషేధిత లిక్విడ్ గంజాయి వెలుగులోకి వచ్చింది.

లిక్విడ్ గంజాయి సీజ్

అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా నుంచి విశాఖపట్నం సిటీకి ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన సంపర్తి కొండలరావు (అలియాస్ మహేష్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.38,50,000 విలువ చేసే 3 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

ఘటనపై ఎస్ఐ బి. నాగ కార్తీక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్మగ్లింగ్ ముఠాలో మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

Next Story