- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేబర్ కమిషనర్ ఆదేశాలు పాటించాలి : సిఐటియు
పూర్తి జీతాలు చెల్లించాలని కార్మికుల డిమాండ్. లేదంటే పోరాటాలు తప్పవని కార్మిక సంఘాల హెచ్చరిక.

దిశ, విశాఖపట్నం : విశాఖ స్టీల్ కార్మికులకు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ తప్పు పట్టింది. స్టీల్ యాజమాన్యానికి పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను స్టీల్ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని విశాఖ స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని, ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఉత్పత్తితో ఎటువంటి సంబంధం లేని కార్మికులపై కక్ష సాధింపు చర్యగా, జీతాల్లో కోతలు విధిస్తున్న యాజమాన్య వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. డిసెంబర్ నెలలో ఆరు లక్షల పద్నాలుగు వందల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేశారని, కానీ 110 కోట్లు నష్టాలు రావడానికి యాజమాన్య అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన వివరించారు. డిసెంబర్ నెలలో కార్మికులకు చెల్లించాల్సిన దానిలో 12 కోట్లను, జనవరి నెలలో రెండున్నర కోట్లను యాజమాన్యం తగ్గించిందన్నారు. కానీ డాలర్ మారకంలో కంపెనీకి 50 కోట్ల అదనపు భారం పడిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉత్పత్తికి కార్మికుల జీతాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన లేబర్ కమిషనర్ ఆదేశాలను ఈ నెలలో చెల్లించే జీతాలలో అమలు చేయాలని, లేని పక్షంలో తదుపరి జరిగే పరిణామాలకు ప్రభుత్వం, యాజమాన్యాలు పూర్తి బాధిత వహించాల్సి ఉంటుందనిహెచ్చరించారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం కావాలనే కార్మికులను ఇబ్బంది పెట్టడం కోసం ఆర్థికంగానూ, మానసికంగానూ వేధించే కార్యక్రమాలను చేపట్టడం దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు. ఉత్పత్తి మెరుగుపరచడం కోసం కార్మికులను ప్రోత్సహించకుండా ఉత్పత్తి నష్టాలను కార్మికులపై నెట్టి ప్రైవేటు వాడికి కట్టపెట్టాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం, యాజమాన్యాలు ఇలా వ్యవహరిస్తున్నాయని వివరించారు. కార్మికులకు హక్కుగా ఉన్న హెచ్ఆర్ఏ నిలుపుదల చేయడంతో పాటు ఉక్కు నగరంలో నివసిస్తున్న వారికి కరెంటు చార్జీలు పెంచడం వంటి చర్యలు కార్మికుల హక్కులపై యాజమాన్యం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. కనుక ఈ సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులను పెద్ద ఎత్తున చైతన్యపరిచి, పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వ యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, మరిడయ్య, బి మహేష్, శ్రీనివాసరెడ్డి, రాజు, ఎ శ్రీనివాస్, చంద్రశేఖర్, సూర్యనారాయణ, అప్పలరాజు, డి దుర్గాప్రసాద్ తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.






