- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిషింగ్ హార్బర్‌లో ఉద్రిక్తత: మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకుని తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియజేయాలని డిమాండ్ చేశారు. ..

దిశ, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకుని తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియజేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా పక్కకు తీసుకెళ్లడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఈ నెల 4న సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. సుమారు 72 గంటల పాటు కోస్ట్ గార్డ్, నేవీ విస్తృతంగా గాలింపు చేపట్టినా వారి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై బాధిత కుటుంబాలు, మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించినప్పటికీ ప్రభుత్వం దాదాపు 20 గంటల ఆలస్యంగా సహాయక చర్యలు ప్రారంభించిందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. "ప్రభుత్వమే న్యాయం చేయకపోతే మాకు న్యాయం చేసేది ఎవరు? పేద మత్స్యకారుల ప్రాణాలకు అంత విలువ లేదా?" అంటూ హార్బర్ యూనియన్ కార్యాలయం ఎదుట మహిళలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అధికారులను నిలదీశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే తమ కుటుంబ సభ్యుల గల్లంతుకు కారణమైందని ఆరోపించిన మత్స్యకారులు, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.






