భార్య చున్నీ ఇరుక్కోవడంతో బైక్ ప్రమాదం.. ఎండాడ హైవేపై ఘోరం

by Ramesh Naini |

విశాఖపట్నం నగరంలోని ఎండాడ జాతీయ రహదారిపై శుక్రవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

భార్య చున్నీ ఇరుక్కోవడంతో బైక్ ప్రమాదం.. ఎండాడ హైవేపై ఘోరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం నగరంలోని ఎండాడ జాతీయ రహదారిపై శుక్రవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ వెనుక చక్రంలో భార్య చున్నీ ఇరుక్కోవడంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎండాడ - జూ పార్క్ మధ్య గల జాతీయ రహదారిపై ఒక దంపతులు బైక్‌పై విశాఖ నగరం వైపు వెళ్తున్నారు. ప్రయాణంలో ఉండగా అనుకోకుండా మహిళ మెడలోని చున్నీ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. చక్రం వేగంగా తిరుగుతుండడంతో చున్నీ ఒక్కసారిగా మహిళ మెడకు బలంగా బిగుసుకుపోయింది. దీంతో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై పల్టీ కొట్టింది.

అపస్మారక స్థితిలోకి బాధితురాలు

చున్నీ మెడకు బలంగా చుట్టుకోవడంతో ఊపిరి అందక ఆ మహిళ అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె భర్తకు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు వెంటనే స్పందించి, వారిని ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు తమ చున్నీలు లేదా చీర కొంగులు చక్రాల్లో పడకుండా జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story