- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కైలాసగిరిపై కనువిందు చేస్తున్న భారీ త్రిశూలం.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
సాగర తీర నగరం విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై కొత్తగా కొలువుదీరిన 65 అడుగుల భారీ త్రిశూలం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాగర తీర నగరం విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై కొత్తగా కొలువుదీరిన 65 అడుగుల భారీ త్రిశూలం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. డమరుకంతో కూడిన ఈ ఆకాశమంత త్రిశూలం రాత్రివేళ విద్యుద్దీపాల వెలుగులో నగరానికి కొత్త ఆధ్యాత్మిక అందాలను అద్దుతోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
సోమనాథ్ ఆలయంతో పోలిక
ఈ అద్భుతమైన నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని పవిత్ర సోమనాథ్ ఆలయ చారిత్రక పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ, విశాఖ కైలాసగిరిపై ఈ అద్భుతమైన త్రిశూలాన్ని ప్రారంభించడం రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ‘సోమనాథ్ ముందున్న విశాలమైన సముద్రం పట్టుదలకు, బలానికి ఎలాగైతే ప్రతీకగా నిలుస్తుందో.. సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న కైలాసగిరి కూడా అదే విశ్వాసాన్ని, శాశ్వతమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. సోమనాథ్ నుంచి వైజాగ్ వరకు, సంస్కృతి, విశ్వాసం, మంచితనంతో మరింత బలంగా ఎదిగేలా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఓం నమఃశివాయ’ అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
విశాఖ పర్యాటకానికి మరో మణిహారం
విశాఖ పర్యాటక ప్రాంతాల్లో కైలాసగిరికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. నగరానికి ఐకానిక్ సింబల్‌గా మారిన భారీ శివపార్వతుల విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హాట్ స్పాట్‌గా ప్రాచుర్యం పొందిన ఈ కొండపై ఇప్పటికే రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్, టాయ్ ట్రైన్, తెలుగు మ్యూజియం వంటి ఎన్నో ప్రాజెక్టులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడు వాటి సరసన ఏకంగా 65 అడుగుల భారీ డమరుక సహిత త్రిశూలం చేరడంతో కైలాసగిరి శోభ మరింత ఇనుమడించింది. రాత్రి వేళల్లో ఈ త్రిశూలం వెదజల్లే కాంతులు నగరవాసులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.






