క్వారీలకు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన

by Thanuru Gopichand |

తిరుమలకుప్పం (Tirumala Kuppam) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

క్వారీలకు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలకుప్పం (Tirumala Kuppam) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తమ గ్రామానికి ఆనుకుని ఉన్న కొండల వద్ద ఏర్పాటు చేస్తున్న స్టోన్, గ్రావెల్ క్వారీలను (Quary) గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. క్వారీల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతోందంటూ స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ నిర్వహణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పనులకు వెళ్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు సైతం రోడ్డుపై బైఠాయిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా లేకుండా యంత్రాల శబ్దాలు, భారీ పేలుళ్లతో ఊరంతా వణికిపోతోందని, దుమ్ము ధూళి వల్ల శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వహిస్తున్నా, అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మైనింగ్ మాఫియాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని.. అందుకే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, మైన్స్ శాఖాధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి, ఈ క్వారీలను తక్షణమే నిలిపివేసే వరకు తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని వారు భీష్మించుకున్నారు. గ్రామస్తుల ఆందోళనతో అక్కడ పరిస్థితి సెగలు పుట్టిస్తోంది.

​ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపినప్పటికీ వారు వెనక్కి తగ్గడంలేదు. భారీ వాహనాల రాకపోకల వల్ల గ్రామంలోని రహదారులు కూడా ధ్వంసమవుతున్నాయని చెబుతున్నారు. పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్వారీ అనుమతులను రద్దు చేయాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Next Story