దేవాలయాల్లో చోరీ.. మాటు వేసి పట్టుకున్న గ్రామస్తులు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 03:33:38  IST  )

వరుస చోరీలతో నిఘా పెంచిన గ్రామస్తులు. భద్రత పెంచాలంటూ పోలీసులకు వినతి.

దేవాలయాల్లో చోరీ.. మాటు వేసి పట్టుకున్న గ్రామస్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరులో (Chittoor) ఆలయాలే లక్ష్యంగా సాగుతున్న వరుస దొంగతనాలకు ఎట్టకేలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. పలమనేరు మున్సిపాలిటీ (Palamaner Municipality) పరిధిలోని ఓ కాలనీకి చెందిన దొంగను గజ్జలవారిపల్లె గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా చిత్తూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని దేవాలయాల్లో విగ్రహాల ఆభరణాలు, హుండీ కానుకలు మాయమవుతున్నాయి. దీంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గజ్జలవారిపల్లె (Gajjalavari Palle) గ్రామస్తులు నిఘాను పెంచారు. మూడు రోజుల క్రితమే కల్లాడు గ్రామంలోని ఆరిమాను గంగమ్మ (Arimanu Gangamma) ఆలయంలో అమ్మవారి మంగళ సూత్రాలు దొంగతనానికి గురవ్వడంతో అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో గజ్జలవారిపల్లెలోని నల్లగంగమ్మ (Nalla Gangamma) ఆలయంలో చోరీకి యత్నిస్తుండగా, గ్రామస్తులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహంతో ఉన్న స్థానికులు అతడిని సమీపంలోని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి పలమనేరు పట్టణానికి చెందినవాడిగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన వస్తువుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వరుస దొంగతనాలతో భయాందోళనలో ఉన్న ప్రజలు, దొంగ పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆలయాల్లో రక్షణ కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఈ దొంగతనాల వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారని సమాచారం.

Next Story