విజయవాడలో పబ్‌ సింగర్‌ బాగోతం.. వలపువలతో అరడజను పెళ్లిళ్లు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-15 05:36:10  IST  )

విజయవాడలోని ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తున్న మహిళ బాగోతమిది. పబ్ లో జరిగిన గొడవపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి అడ్డంగా బుక్కైపోయిందామె.

విజయవాడలో పబ్‌ సింగర్‌ బాగోతం.. వలపువలతో అరడజను పెళ్లిళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తున్న మహిళ బాగోతమిది. పబ్ లో జరిగిన గొడవపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి అడ్డంగా బుక్కైపోయిందామె. సదరు సింగర్ కు 20 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గొడవల కారణంగా భర్తతో విడిపోయిన ఆమె.. బందర్ రోడ్డులో ఉన్న ఒక పబ్ లో సింగర్ గా పనిచేస్తోంది. ఆ పబ్బుకు వచ్చే బడాబాబులతో పరిచయం పెంచుకుని తన బాధల్ని చెప్పుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళిళ్లు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకూ సుమారు అరడజను మందిని పెళ్లాడగా.. వారిలో పెళ్లైనవారు, పెళ్లికానివారు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల పబ్‌లో రెండు, మూడు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తలెత్తగా, వాటిలో ఒక గ్రూపునకు చెందిన వ్యక్తితో గాయనికి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని గమనించిన గాయనితో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి, బందరు రోడ్డులోని ఎస్‌ఎస్ కళ్యాణ మండపం వద్ద విధుల్లో ఉన్న సీఐని కలిసి పబ్‌లో జరుగుతున్న పరిస్థితులను వివరించారు.

సీఐ స్పందించి.. పబ్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందనే సమాచారంతో తన సిబ్బందికి అక్కడ నిఘా పెట్టాలని ఆదేశించారు. పబ్‌పై తనిఖీ సందర్భంగా గాయనిపై అనుమానం పెరగడంతో ఆమెను, ఆమెకు సమీపంగా ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. విచారణలో గాయనిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేసిన దర్యాప్తులో ఆమె ఈ ఏడాది జూన్ 5న వన్‌టౌన్‌కు చెందిన వ్యక్తిని దుర్గగుడిలో, అదే నెల 27న పోరంకికి చెందిన మరొకరిని సింహాచలంలోని ఒక కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నట్లు తెలిసింది.

ఇదే కాకుండా, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వివాహితుల నుంచి గణనీయంగా డబ్బులు తీసుకున్నట్లు సమాచారముంది. ప్రత్యేకంగా కొత్తపేటకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని, అతని ద్వారా కొంత ఆర్థిక లబ్ధిని పొందాలని ప్రయత్నించినట్లు చెబుతున్నారు. కొత్తపేటకు చెందిన ఆ వ్యక్తికి గతంలోనే పెళ్లవ్వగా.. పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. అతను పబ్‌లకు తరచూ వెళ్లేవాడు. ఆ గాయకురాలిని ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడిగా పరిచయం చేసుకున్నట్టు చెబుతున్నారు. అంతేకాక ఆమె కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఆమెకు సుమారు రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు అందించినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. గాయకురాలి ప్రవర్తన వల్ల పబ్‌కు వచ్చే పలువురు వ్యక్తులు ఆర్థికంగా నష్టపోయారని, మోసపోయామని ఆరోపిస్తున్నారు.

Next Story