మంటల్లో కారు దగ్ధం.. ప్రాణ భయంతో పరుగులు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-06 05:10:50  IST  )

కృష్ణాజిల్లా (Krishna District) బాపులపాడు మండలం వీరవల్లి వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది.

మంటల్లో కారు దగ్ధం.. ప్రాణ భయంతో పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణాజిల్లా (Krishna District) బాపులపాడు మండలం వీరవల్లి వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని ప్రయాణికులు కారులో నుంచి కిందకు దిగి పరుగు పెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం చెన్నై – కలకత్తా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మారుతి ఎర్టిగా (Maruti Ertiga) కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారును మంటలు చుట్టు ముట్టేయడంతో అది పూర్తిగా దగ్ధమైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తాడ్వాయికి చెందిన ఒక కుటుంబం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం కోసం కారులో బయలుదేరింది. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుండగా.. జంగారెడ్డిగూడెం నుంచి వీరవల్లి చేరుకునేసరికి కారులో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డుకు పక్కగా తీసుకెళ్లి నిలిపివేశాడు. దీంతో అందులో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటికి పరుగులు తీశారు. వారు బయటపడగానే క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగారని స్థానికులు తెలిపారు. వారి అప్రమత్తత వల్లే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

​ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. జాతీయ రహదారిపై కారు దగ్ధం కావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే కారు పూర్తిస్థాయిలో దగ్ధమవడంతో ఆస్తి నష్టం జరిగిందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

Next Story