మీడియా రంగంలోకి విజయసాయి రెడ్డి: త్వరలో మూడు భాషల్లో న్యూస్ ప్లాట్‌ఫామ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-11 09:21:38  IST  )

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మూడు భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో పాటు త్వరలో శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

మీడియా రంగంలోకి విజయసాయి రెడ్డి: త్వరలో మూడు భాషల్లో న్యూస్ ప్లాట్‌ఫామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆయన మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తన సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఓ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. అయితే, ఈ ప్లాట్‌ఫామ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని వివరిస్తూ విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ వార్తా కథనాలను అందించనున్నట్లుగా తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని, పూర్తి నిష్పాక్షికంగా, కేవలం సత్యం వైపు మాత్రమే నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

త్వరలో శాటిలైట్ న్యూస్ ఛానల్..!

డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ విజయవంతమైన తర్వాత, అదే విలువలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ (Satellite News Channel)ను కూడా ప్రారంభించాలన్నది తమ ప్రణాళిక అని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం డిజిటల్ వేదికకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, దీని పేరును త్వరలోనే వెల్లడిస్తానని ఆయన తెలిపారు. అయితే, విజయసాయి రెడ్డి లాంటి సీనియర్ నేత సొంతంగా ఓ మీడియా సంస్థను ప్రారంభిస్తుండటం ఇప్పుడు రెండు తెలుగు స్టేట్స్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Next Story