- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏవియేషన్ చరిత్రలో ఒక మైలురాయి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
భారత్‌లోనే ప్రాంతీయ రవాణా విమానాలను (Regional Transport Aircraft) తయారు చేయడానికి, దేశీయంగా సమగ్ర విమానయాన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ (Embraer) మరియు అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ సంస్థలు చేతులు కలిపాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా మరో కీలక ముందడుగు పడింది. భారత్‌లోనే ప్రాంతీయ రవాణా విమానాలను (Regional Transport Aircraft) తయారు చేయడానికి, దేశీయంగా సమగ్ర విమానయాన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ (Embraer) మరియు అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ సంస్థలు చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం కుదిరింది.
'ఉడాన్' పథకానికి కొత్త రెక్కలు
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎంబ్రేయర్, అదానీ గ్రూప్ మధ్య జరిగిన ఈ ఒప్పందం భారతీయ ఏవియేషన్ చరిత్రలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఉడాన్' (UDAN) పథకం దార్శనికతకు అనుగుణంగా, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ట్విట్టర్ (X) వేదికగా పేర్కొన్నారు. ‘ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, భారత్ మరియు బ్రెజిల్ దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనం. అదానీ ఏరోస్పేస్, ఎంబ్రేయర్ రూపంలో ఒక సరైన జోడీ కుదిరింది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో ప్రాంతీయ రవాణా విమానాల కోసం 'ఫైనల్ అసెంబ్లీ లైన్' (FAL) ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేసి, దశలవారీగా విడిభాగాల తయారీలో స్వదేశీ పరిజ్ఞానాన్ని (Indigenisation) పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయంగా విమాన భాగాల తయారీ, ఎంఆర్ఓ (MRO - Maintenance, Repair, and Operations) సేవల ద్వారా ప్రపంచ విమానయాన సరఫరా గొలుసులో భారత్ పాత్రను బలోపేతం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బ్రెజిల్ రాయబారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ తయారీ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు, మొదటి విమానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే వివరాలను సంస్థలు ఇంకా వెల్లడించలేదు.






