అజిత్ పవార్ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం: సీఎంకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ

by Ramesh Naini |

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమాన ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం: సీఎంకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమాన ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) రాసిన లేఖకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

బ్లాక్ బాక్స్ స్వాధీనం..

ఈ ప్రమాదంపై 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) ఇప్పటికే లోతైన దర్యాప్తును ప్రారంభించిందని తెలిపారు. విమాన గమనానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిక్షిప్తం చేసే బ్లాక్ బాక్స్‌ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. దీని ద్వారా ప్రమాద సమయంలో చోటుచేసుకున్న సాంకేతిక పరిణామాలను విశ్లేషించనున్నారు.. విమాన ప్రమాదాల నియమావళి ప్రకారం ఈ విచారణ అత్యంత పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రమాద స్థలంలోని ఆధారాలతో పాటు, విమానానికి సంబంధించిన సాంకేతిక రికార్డులు, నిర్వహణ (Operational) వివరాలను నిపుణుల బృందం పరిశీలిస్తోందన్నారు. ఈ విచారణలో స్థానిక యంత్రాంగం, మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా కీలకమని, దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Next Story