- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ వాజ్‌పేయి పార్క్‌లో ‘స్వచ్ఛ భారత్ పాల్గోన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
విజయవాడలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందంటూ రూ.15 వేల కోట్ల నిధుల వెల్లడి!

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పర్యటనలో భాగంగా వన్‌టౌన్‌లోని వాజ్‌పేయి పార్క్‌లో నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా చీపురు పట్టి పార్క్ పరిసరాలను శుభ్రం చేసిన అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పార్కుకు వచ్చిన వాకర్స్‌తో ‘చాయ్ పే చర్చ’ నిర్వహించి, మోడీ ప్రభుత్వ విజయాలను వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం దేశానికి సేవలందిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. గత పదేళ్లలో భారతదేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమై, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రికార్డు స్థాయిలో 8 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటికే రూ.15,000 కోట్లు కేటాయించిందని, హడ్కో ద్వారా మరో రూ.11,000 కోట్లు అందించిందని వెల్లడించారు. అమరావతికి అత్యుత్తమ రోడ్డు, రైల్వే కనెక్టివిటీని పెంచుతున్నామని, ప్రత్యేక రైల్వే లైన్‌ను కూడా మంజూరు చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రహ్లాద్ జోషి భరోసా ఇచ్చారు.






