ఏపీలో ఇన్‌ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. డిసెంబరులో ప్రత్యేక ‘టెట్’ (TET) పరీక్ష!

by Malleboina Mahesh |

ఏపీలో ఇన్‌ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది డిసెంబరులో ప్రత్యేక ‘టెట్’ (TET) నిర్వహణకు మంత్రి లోకేష్ సానుకూల నిర్ణయం.

ఏపీలో ఇన్‌ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. డిసెంబరులో ప్రత్యేక ‘టెట్’ (TET) పరీక్ష!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు (In-service teachers) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ లో టీచర్లకు టెట్(TET) పరీక్షను నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు సంబంధించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సర్వీసులో ఉండి, ఇంకా టెట్ (TET) అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబరులో ఈ ప్రత్యేక పరీక్షను నిర్వహించే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఫైలును పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసిందని అధికారులు వెల్లడించారు. ఇటీవల సాధారణ టెట్ నోటిఫికేషన్ (Tet Notification) విడుదలైన నేపథ్యంలో.. ఇన్‌ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా పరీక్ష పెట్టాలనే డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి బలంగా వచ్చాయి.

రాష్ట్రంలో సుమారు 80 వేల మందికి పైగా ఇన్‌ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత (Tet eligibility) సాధించాల్సి ఉండటం, అలాగే టీచర్లందరికీ టెట్ తప్పనిసరి అని గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఈ అంశంపై సోమవారం ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్‌లు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను, పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను వేర్వేరుగా కలిసి చర్చించారు. ఈ భేటీలలో ప్రత్యేక టెట్ నిర్వహణపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చింది. కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న సాధారణ టెట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసుకునే వీలుందని అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది చివర్లో జరిగిన టెట్ పరీక్షలో దాదాపు 15 వేల మందికి పైగా ఇన్‌ సర్వీస్ టీచర్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Next Story