బ్యాంకర్లకు కేంద్రమంత్రి పెమ్మసాని హెచ్చరిక

by Thanuru Gopichand |

బ్యాంకర్లను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Shekar) హెచ్చరించారు.

బ్యాంకర్లకు కేంద్రమంత్రి పెమ్మసాని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : బ్యాంకర్లను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Shekar) హెచ్చరించారు. బ్యాంకర్ల తీరును తప్పుబడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం (Bankers Meeting) జరిగింది. సమావేశానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. రుణాల మంజూరు విషయంలో కార్పొరేట్ బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రుణాలు మంజూరు చేసే విషయంలో సరైన విధానం అనుసరించట్లేదని పేర్కొన్నారు. గత మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో రుణాల మంజూరు సవ్యంగా జరగాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కూడా బ్యాంకర్లలో ఎటువంటి మార్పు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకులు వ్యాపారంపైనే దృష్టి పెడుతున్నాయని అన్నారు.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వాటిలో కనపడడం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే బ్యాంకుల్లోని డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకులకు మళ్లిస్తామని హెచ్చరించారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల కింద రుణాలను మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులు ఆగిపోలేదన్నారు. పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. గుంటూరు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ఆర్ఓబీ పనుల్లో భాగంగా రైల్వే ట్రాక్ పై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించే పనులు రెండు మూడు వారాల్లో ప్రారంభం అవుతాయన్నారు. ఒకవైపు పనులు పూర్తైన తరువాత మరోవైపు పనులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. వ్యాపారులు కోరినట్లు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యపడదని ప్రకటించారు.

Next Story