Yogandhra-2025:యోగా డేకు అనూహ్య స్పందన.. ఆ రికార్డు బద్దలు కొట్టిన ‘యోగాంధ్ర’

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-21 02:02:56  IST  )

Yogandhra-2025:యోగా డేకు అనూహ్య స్పందన.. ఆ రికార్డు బద్దలు కొట్టిన ‘యోగాంధ్ర’
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఈ క్రమంలో నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి యోగ సాధనలో పాల్గొన్నారు. ఈ రోజు(శనివారం) ఉదయం 4 గంటల నుంచే ప్రజలు యోగా డే వేదిక వద్దకు చేరుకుంటున్నారు. వేకువజామున 5:45 గంటల సమయానికి సుమారు లక్షన్నర మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ భారీ ప్రజానీకం గతంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించినట్లైంది. భారీ ఎత్తున ప్రజలు హాజరవుతుండడంతో వారిని లెక్కగట్టేందుకు ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తూ.. వారిని లెక్కలోకి తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ తరుణంలో ఉదయం 7 గంటల సమయానికి హాజరయ్యే వారి సంఖ్య మరో లక్ష వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో యోగా డే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. చిన్న, పెద్ద అందరూ ఉత్సాహంగా యోగాసనాలు వేస్తున్నారు. దీంతో విశాఖ యోగా డే దృశ్యాలు అందిరినీ ఆకట్టుకుంటున్నాయి. యోగాంధ్ర కార్యక్రమం ప్రజల ఆరోగ్యం మరియు యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.

Next Story