Ugadi celebrations : శ్రీశైలంలో రేపటి నుంచి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు

by Ramesh Naini |

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు రంగం సిద్ధమైంది.

Ugadi celebrations : శ్రీశైలంలో రేపటి నుంచి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. సోమవారం (రేపు) నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను కళ్లారా చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా కన్నడ భక్తుల రాకతో శ్రీగిరి క్షేత్రం 'శివనామస్మరణ'తో మారుమోగుతోంది.

కన్నడ భక్తుల పాదయాత్ర

ఉగాది ఉత్సవాల వేళ శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడం కన్నడ భక్తులకు ఆనవాయితీ. వేల సంఖ్యలో భక్తులు నల్లమల అడవుల గుండా కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల పుర వీధులన్నీ కన్నడ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పకడ్బందీగా ఏర్పాట్లు ఉత్సవాల నిర్వహణపై దేవస్థాన కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు ముగిశాయి.

ప్రతిరోజూ విశేష వాహన సేవలు

భక్తుల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాయి. మరోవైపు పాదయాత్ర చేసే భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులందరికీ స్వామివారి 'అలంకార దర్శనం' లభించేలా చర్యలు తీసుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజూ స్వామి-అమ్మవార్లకు విశేష వాహన సేవలు, అలంకారాలు నిర్వహించనున్నారు. మార్చి 16 (సోమవారం)యాగశాల ప్రవేశం, చండీశ్వరపూజ, అంకురార్పణ, భ్రమరాంబాదేవికి విశేష కుంకుమార్చనలు, మార్చి 18 వీరాచార విన్యాసాలు (భక్తుల శివ భక్తి ప్రదర్శనలు), మార్చి 19 (ఉగాది) పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారం, మార్చి 20 పూర్ణాహుతి, అశ్వ వాహనసేవ, అమ్మవారి నిజాలంకరణ దర్శనం, ప్రతి రోజూ సాయంత్రం వేళ స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Next Story