- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఉడాన్' 9 ఏళ్ల ప్రస్థానం.. సామాన్యుడికి చేరువైన విమానయానం
విమాన ప్రయాణం అంటే కేవలం ధనవంతులకే అనే భావనను చెరిపేస్తూ 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (UDAN) అనే నినాదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణం పోశారని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : విమాన ప్రయాణం అంటే కేవలం ధనవంతులకే అనే భావనను చెరిపేస్తూ 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' (UDAN) అనే నినాదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణం పోశారని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రతి భారతీయుడికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధానమంత్రి సంకల్పంతో మొదలైన ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (RCS) అయిన ఉడాన్, నేటికి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని దేశ పౌర విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని తెలిపారు. జాతీయ పౌర విమానయాన విధానానికి ముందే ఒక కీలక సమావేశంలో ఈ ఆలోచన రూపుదిద్దుకుందన్నారు. సరిగ్గా 2016 అక్టోబరు 21న '#UDAN' పేరుతో వాస్తవ రూపం దాల్చిందన్నారు. విమానయాన సౌకర్యం లేని, తక్కువగా ఉన్న చిన్న పట్టణాలు, ప్రాంతాలను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగిందన్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళ్తే ....
అంకెల్లో ‘ఉడాన్’
గత తొమ్మిదేళ్లలో ఉడాన్ పథకం ద్వారా సాధించిన ప్రగతి అపారమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఉడాన్ సమ్మిళిత వృద్ధికి ప్రకాశవంతమైన చిహ్నంగా మారింది. 1.56 కోట్లకు పైగా ప్రయాణికులకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 3.23 లక్షలకు పైగా ఉడాన్ విమానాలు ప్రయాణించాయి. 649 రూట్లు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 93 వరకు సేవలు లేని (Unserved), సేవలు తక్కువగా ఉన్న (Underserved) విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్‌లు అనుసంధానం అయ్యాయి. ప్రారంభంలో చిన్న పట్టణాల నుంచి ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకు విమాన టికెట్ ధరలు రూ. 2,500 లోపు ఉండేలా ప్రభుత్వం 'వైబిలిటీ గ్యాప్ ఫండింగ్' (VGF) ద్వారా ఎయిర్‌లైన్స్ సంస్థలకు మద్దతు ఇచ్చింది.
చిన్న పట్టణాలకు కొత్త ‘గుర్తింపు’
ఉడాన్ పథకం కేవలం విమాన ప్రయాణాన్ని చవకగా మార్చలేదు, దేశంలోని చిన్న పట్టణాల ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాలుగా పరిగణించబడిన ధర్భంగా, హుబ్బళ్లి, షిల్లాంగ్ వంటి ప్రాంతాలకు ఇప్పుడు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అనుసంధానం కారణంగా ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమందింది. విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ. 4,638 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గు ముఖం పట్టాయి.
రైతులకు సైతం లబ్ది చేకూర్చేలా 'కృషి ఉడాన్' వంటి ఉప-పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉడాన్ కేవలం ఒక పథకం కాదు, ఇది దేశ పౌర విమానయాన రంగంలో సమ్మిళిత వృద్ధికి, సాధికారతకు నిదర్శనం. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి, మరో 120 కొత్త గమ్యస్థానాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే దశాబ్దంలో 4 కోట్ల అదనపు ప్రయాణికులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.






