ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కు యూఏఈ తోడ్పాటు

by Thanuru Gopichand |

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కు యూఏఈ తోడ్పాటు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ (Food Processing) రంగాన్ని అభివృద్ధి చేసేందుకు యూఏఈకి చెందిన 'దుబాయ్ ఫుడ్ క్లస్టర్' (Dubai Food Cluster) తో కలిసి పనిచేసేందుకు యూఏఈ (UAE) ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఆహార శుద్ధి పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, మార్కెట్ సదుపాయం లభించనుంది. అంతేకాకుండా యూఏఈకి చెందిన సుమారు 40 ప్రముఖ సంస్థలు ఏపీలో తమ యూనిట్లను ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామని అల్ మార్రీ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చారు.

​రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన సీఎం.. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై కూడా యూఏఈ మంత్రితో చర్చలు జరిపారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సీఎం వివరించారు. ముఖ్యంగా ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, వ్యవసాయ వనరులను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు యూఏఈ సహకారాన్ని కోరారు. ఏపీలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తూ అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాలు, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed Of Doing Business) వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. ఈ ఒప్పందాలు మరియు చర్చలు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story