ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

ఏపీలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు.

ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీపురుపల్లి మండలం చొక్కారపాలెం గ్రామానికి చెందిన బొల్లు పైడిరాజు అనే వ్యక్తి రోడ్డుప్రమాదంలో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం అంపలాం గ్రామానికి చెందిన తమ్మిన చంద్రబోస్, చీపురుపల్లి మండలం చొక్కారపాలెం గ్రామానికి చెందిన చొక్కర వెంకటరమణ రొయ్యపిల్లల కోసం బొల్లు పైడిరాజు (35)కు చెందిన సరుకు రవాణా వాహనంలో కాకినాడ జిల్లాలోని వేమవరానికి వెళ్లారు.

రొయ్యపిల్లల సరుకు తీసుకుని తిరిగి వస్తుండగా.. నక్కపల్లి టోల్ ప్లాజా సమీపంలో టైర్లలో గాలి చెక్ చేసేందుకు ఆపారు. పైడిరాజు గాలిని చెక్ చేస్తుండగా.. బొలేరో వెహికల్ వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

పెళ్లికి వెళ్లొస్తూ..

పోలవరం జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి శివారులో ప్రమాదం జరిగింది. జడ్డంగి ఎస్సై చినబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లికి చెందిన బీరబోయిన వరప్రసాద్, భార్య సీతారత్నం దంపతులు మరో ముగ్గురితో కలిసి కారులో అన్నవరంలో ఓ వివాహ వేడుకకు వెళ్లారు. తిరిగి వస్తుండగా.. శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడగా.. సీతారత్నం (32) మరణించింది. మిగిలిన వారు గాయపడగా.. వారిని జడ్డంగి పీహెచ్ సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రెండు ప్రమాదాలపై ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story