విజయమ్మకు లోకేష్ విషెస్.. పవన్‌కు జగన్ పరామర్శ : రాష్ట్రంలో ట్వీట్ల రాజకీయం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-19 07:39:46  IST  )

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి లోకేష్, జగన్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి.

విజయమ్మకు లోకేష్ విషెస్.. పవన్‌కు జగన్ పరామర్శ : రాష్ట్రంలో ట్వీట్ల రాజకీయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే విమర్శలు, ప్రతివిమర్శలకు భిన్నంగా ఆదివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపట్ల ఒకరు ప్రదర్శించిన మర్యాదపూర్వక ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

విజయమ్మకు లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాను," అని లోకేష్ ట్వీట్ చేశారు. ప్రత్యర్థి పార్టీ నేత కుటుంబానికి ఆయన ఈ విధంగా శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకర్షించింది.

పవన్ త్వరగా కోలుకోవాలన్న జగన్

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఆయనకు వైద్యులు ఓ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "పవన్ కల్యాణ్ సర్జరీ తర్వాత త్వరగా, పూర్తిస్థాయిలో కోలుకోవాలని కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్," అని జగన్ ట్వీట్ చేశారు.

రాజకీయంగా నిత్యం మాటల యుద్ధం చేసుకునే ఈ నాయకులు, వ్యక్తిగత, ఆరోగ్య విషయాల్లో ఒకరినొకరు పలకరించుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. లోకేష్, జగన్ ఇద్దరూ ఒకే రోజు ఇలాంటి ట్వీట్లు చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Next Story