తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి.. ప్రత్యేక ఏర్పాట్లపై అదనపు ఈఓ సమీక్ష

by Naga Rani Yarlagadda |

మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈఓ సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి.. ప్రత్యేక ఏర్పాట్లపై అదనపు ఈఓ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో శ్రీ తుంబురుతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 31న ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 1న ఉదయం 10 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు, త్రాగునీటిని 100 మంది శ్రీవారి సేవకులు ద్వారా పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని టీటీడీ సిబ్బందిని ఆదేశించారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Next Story