- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వీఐపీ బ్రేక్ సహా వీరికి దర్శనాలు రద్దు
తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అడిషినల్ ఈఓ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అడిషినల్ ఈఓ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో ఈ సమీక్ష జరిగింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 8న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15వ తేదీన ధ్వజారోహణం చేస్తారు. 19వ తేదీన భక్తులు వేయికళ్లతో ఎదురుచూసే గరుడవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 22వ తేదీన రథోత్సవం, 23న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలతో పాటు.. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో గ్యాలరీల్లో ఉండే భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుద్దీపాలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకునేలా ఉండాలని, స్వామివారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. 19వ తేదీన గరుడవాహన సేవకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ ఉదయం వరకూ కొండపైకి టూ వీలర్లకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు.






