భక్తులకు టీటీడీ అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది..

భక్తులకు టీటీడీ అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వైకుంఠ ద్వార ద‌ర్శనాలకు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ముస్తాబవుతోంది. ఈ నెల 30 నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైభవంగా వైకుంఠ ద్వార ద‌ర్శనాలను నిర్వహించారు. ఈ మేరకు భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు క్యూలైన్లలో తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మ‌రుగుదొడ్ల సౌక‌ర్యాలను టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని క్యూలైన్ల‌లో ప‌లు మార్పులు చేప‌ట్టామ‌న్నారు. క్యూలైన్ల‌లో భ‌క్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయ‌డంతో పాటు, తాగునీటి సౌక‌ర్యం, క్యూలైన్ల‌కు అనుసంధానంగా అద‌న‌పు మ‌రుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ఈవో వెంక‌య్య చౌద‌రి తెలిపారు.

భ‌క్తుల కొర‌కు మొబైల్ వాట‌ర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు


చ‌లికాలం కావ‌డంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చ‌ల్లబ‌డ‌కుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు ఈవో వెంక‌య్య చౌద‌రి వెల్లడించారు. భ‌క్తుల‌కు తాగునీరు అందించేందుకు అద‌నంగా మొబైల్ వాట‌ర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. భ‌క్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన స‌దుపాయాల‌ను వినియోగించుకునేందుకు వివిధ భాష‌ల్లో సూచిక‌ బోర్డుల‌ను కూడా క్యూలైన్లతో పాటు ప్రధానమైన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేశామ‌న్నారు. భ‌క్తులంద‌రూ టీటీడీ క్యూలైన్ల‌లో క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకుని సంయ‌మ‌నంతో స్వామివారిని ద‌ర్శంచుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు.

Next Story