విదేశాల్లో అనధికారికంగా శ్రీనివాస కల్యాణాలు.. టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-09 12:51:27  IST  )

విదేశాల్లో అనధికారికంగా శ్రీనివాస కల్యాణాలు జరిపించడం పట్ల టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది..

విదేశాల్లో అనధికారికంగా శ్రీనివాస కల్యాణాలు.. టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నారు. యూకేలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ యూనైటెడ్ కింగ్డమ్ లోని Slough SL 1 3 LW వద్ద Singh Sabha Slough Sports Centreలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికను వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేశారు. దీంతో టీటీడీ స్పందించింది. శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి అనుమతి లేదని, తాము కూడా ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది.

అయినప్పటికీ ఆహ్వాన పత్రికలో టీటీడీ లోగోను వాడారని, అనధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం భక్తులను తప్పుదారి పట్టిస్తూ గందరగోళానికి గురిచేయడమేనని మండిపడింది. ఆహ్వాన పత్రికలో ఉచితమని పేర్కొన్నప్పటికీ ప్రత్యేక సేవలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని పేర్కొంది. అంతేకాక భక్తుల నుంచి సేవా ఫీజుల పేరుతో వసూళ్లు చేసే అవకాశం ఉందని చెప్పింది. ఆహ్వాన పత్రంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (£ 566 పౌండ్లు) వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం కనిపించిందని తెలిపింది. డబ్బులు వసూలు చేసే అంశంతో పాటు తిరుమల కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, వేంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయని చెప్పింది. సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖను ఆదేశించినట్లు టీటీడీ స్పష్టం చేసింది.

గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. అనుమతులు లేకుండా శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నకిలీ కల్యాణోత్సవాల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వైరల్ చేసి డబ్బులు కోరితే విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకురావాలని టీటీడీ సూచించింది.

Next Story