- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో గో పూజ మహోత్సవం: టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
గోవులను రక్షణతో భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు

దిశ, వెబ్ డెస్క్: గోవులను రక్షించుకుందామని, తద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు. గోకులాష్టమి సందర్భంగా తిరుపతి వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్వహించిన గో పూజ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామల రావు మాట్లాడుతూ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మొత్తం 2,789 గోవులు ఉన్నాయని, అందులో 1827 ఆవులు, 962 ఎద్దులు, 7 ఏనుగులు , 5 గుర్రాలు-5 ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు తిరుమల, తిరుపతి, తిరుచానూరు గోశాలల్లో, అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరంలో “గోపూజ” నిర్వహించడం జరుగుతోందని శ్యామలారావు చెప్పారు.
ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో పూజా కైంకర్యాల నిమిత్తం దేశవాళీ గోవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని గోశాల నుంచి సరఫరా చేస్తున్నట్లు శ్యామలారావు చెప్పారు. దైవ కార్యక్రమాలకే కాకుండా టీటీడీ పరిధిలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే భక్తులకు, చంటి బిడ్డలకు, వృద్ధులకు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, క్యాంటీన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రత్యేకంగా పాలను సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు పిండ మార్పిడి విధానంలో 47 మేలు రకమైన “సాహివాల్” జాతి దూడలు జన్మించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 539 దేశవాళీ గోవులను దాతల సహకారంతో తిరుపతి వేంకటేశ్వర గోసంరక్షణ శాలకు తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరో 500ల దేశవాళీ గిర్, కాంక్రేజ్, థార్పార్కర్, రెడ్ సింధీ తదితర ఆవులను దాతల సహకారంతో ఎస్వీ గోశాలకు తీసుకురానున్నట్లు శ్యామలారావు చెప్పారు.
టీటీడీ దేశవ్యాప్తంగా 195 ఆలయాలకు ఉచితంగా ఆవు, దూడలను అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాలలో “గుడికో గోమాత” పథకం ద్వారా గోశాల నుంచి అందించిన గోమాతలకు భక్తులు నిత్యం “గోపూజ ” నిర్వహిస్తున్నారన్నారు. గోశాలలో రూ.12.25 కోట్లతో “ఎస్వీ పశుదాణా తయారీ కేంద్రం” ఏర్పాటు చేసినట్లు శ్యామలారావు తెలియజేశారు. ఇందులో గోశాలలలో ఉన్న దేశవాళీ గోవుల ఆరోగ్య పరిరక్షణ, అధిక పాల ఉత్పత్తికి అవసరమైన, నాణ్యమైన మేలురకపు “సమతుల్య పశుదాణా”ను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడం జరుగుతోందన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, నిర్వహణ, సంతానోత్పత్తి, సంక్షేమ కార్యకలాపాలపై విలువైన సలహాలు, సిఫార్సులు అందించేందుకు, టిటిడి గోశాలలో జరుగుతున్న సాధారణ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి గోశాల నిపుణులు కమిటీని ఏర్పాటు చేశామని శ్యామలారావు పేర్కొన్నారు.






