- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
టీడీ ధర్మకర్త మండలి (TTD Board Meeting) తిరుమలలో సమావేశమైంది. మంగళవారం జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షత వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ధర్మకర్త మండలి (TTD Board Meeting) తిరుమలలో సమావేశమైంది. మంగళవారం జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షత వహిస్తున్నారు. చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 50కి పైగా అంశాలపై ధర్మకర్తల మండలి సభ్యులు చర్చించనున్నారు. అంతేకాకుండా వివిధ అంశాలకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు, దివ్య వృక్షాల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చిస్తున్నారు. డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. లక్కీ డిప్ ద్వారా మొదటి మూడు రోజులు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. ఎటువంటి టోకెన్ లేని భక్తులను కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సర్వదర్శనం టోకెన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులకు అవకాశం కల్పించనున్నారు. లక్కీ డిప్ మూడు రోజులు మినహా మిగిలిన 7 రోజులు ఈ విధానం అమలులో ఉండనుందని తెలిపారు.
ఈ ఏడాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ధర్మకర్తల మండలి సభ్యులు నిర్ణయించారు. రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా అభిప్రాయపడ్డారు. అదే విధంగా పీఏసీల అభివృద్ధి గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్న విషయంపై సభ్యులు చర్చించారు. అందుకు సంబంధించి ఇటీవల రూ.9 కోట్ల విరాళం అందిన విషయం ప్రస్తావనకు వచ్చింది. కాటేజ్ డోనర్ ప్రివిలైజెస్ నూతన పాలసీపై కూడా సభ్యులు లోతైన చర్చలు చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో 5వేల ఆలయాల నిర్మాణానికి సమగ్ర విధివిధానాలపై సభ్యులు చైర్మన్ అధ్యక్షతన చర్చించారు. అదే విధంగా శ్రీవారి ఆలయ ధ్వజస్తంభాల కోసం వంద ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకానికి ప్రణాళిక రూపొందించిన విషయంపై కూడా మండలి సమావేశంలో సమాలోచనలు జరిపారు. అందుకు పలమనేరులోని టీటీడీ గోశాల అనువైన ప్రాంగణంగా తీర్మానించారు.
తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో సౌకర్యాల కల్పనకు రూ.48కోట్లు మంజూరు చేస్తున్నామని బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపామన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోద ముద్ర వేశామన్నారు. ముంబాయిలోని బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల్లో రెండో దశకు రూ.14.10 కోట్లు మంజూరు చేశామన్నారు. పద్మావతి మహిళా డిగ్రీ కళావాలలో ప్రస్తుతం 2100 హాస్టల్ సీట్లున్నాయని, అదనంగా 270 సీట్లు పెంచుతామన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారిక పోటు కార్మికులు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలు పెంచాలని నిర్ణయించామని వెల్లడించారు.
అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.60లక్షల విరాళం
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మొత్తం రూ.60 లక్షల విరాళం అందాయి. డీడీలను టీటీటీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో దాతలు చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఒక్కొక్కరూ రూ.10 లక్షల చొప్పున విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన కెఎన్ నయన, వి.ప్రభా, ఎస్ రాజేశ్, కెఎన్ సందీప్ కుమార్, గుంటూరుకు చెందిన దేవరశెట్టి రితిష్, దేవరశెట్టి సత్యనారాయణ చైర్మనుకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు.






