- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గమ్మ గుడిలో ట్రస్ట్ బోర్డు మెంబర్ భర్త వీరంగం!
తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతున్న బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధి.

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Vijaywada) కొలువుదీరిన కనకదుర్గమ్మ (Kanaka Durgamma) ఆలయంలో ఒక ట్రస్ట్ బోర్డు సభ్యురాలి భర్త (Trust Board Member Husband) సామాన్య భక్తులు, ఆలయ సిబ్బంది ముందే వీరంగం సృష్టించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మార్గదర్శకంగా ఉండాల్సిన పాలక మండలి సభ్యులే, తమ వ్యక్తిగత అహంకారం కోసం పవిత్ర ఆలయ ప్రాంగణాన్ని వివాదాలకు వేదికగా మార్చడంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వరుస వివాదాలతో దేవాలయం వార్తలొక్కి ఎక్కుతోంది. మరోసారి వివాదం తలెత్తడంతో దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడి పవిత్రతను కాపాడడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని భక్తులు సూచిస్తున్నారు. తీరు మారకపోతే దైవాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు
అసలేం జరిగిందంటే..
మూడు రోజుల క్రితం దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ తరిగొప్పల పార్వతి, తన భర్త హుస్సేన్ (Hussain), మరో నలుగురు మహిళలతో కలిసి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసే సమయంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. పార్వతితోపాటు వచ్చిన వారిలో ఇద్దరికి జాకెట్ ముక్కలు, మరో ఇద్దరికి ప్రసాదం ఇచ్చి పండితులు ఆశీర్వదించారు. అయితే తమతో వచ్చిన అందరికీ శేషవస్త్రాలు, జాకెట్ ముక్కలు, ప్రత్యేక ప్రసాదాలు ఎందుకు ఇవ్వలేదని హుస్సేన్ అక్కడి సిబ్బందిపై విరుచుకుపడ్డారు.
సిబ్బందిపై బూతులతో రెచ్చిపోయిన హుస్సేన్
అందరికీ సమానంగా మర్యాదలు జరగలేదన్న సాకుతో హుస్సేన్ సహనం కోల్పోయారు. ఆలయ ఉద్యోగులను ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో, బూతులతో రెచ్చిపోయారు. మేము బోర్డు మెంబర్లం అని తెలియదా? మాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో భార్య పార్వతి కనీసం తన భర్తను వారించే ప్రయత్నం చేయకపోగా, మౌనంగా ఉండి అతడికి మద్దతు పలికినట్లు అక్కడి భక్తులు చెబుతున్నారు. ఒక పక్క భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా, ఏమాత్రం పట్టించుకోకుండా హుస్సేన్ చేసిన రభస ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల మౌనం.. భక్తుల ఆవేదన
ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆలయ ఉన్నతాధికారులు కనీసం నోరు మెదపకపోవడం గమనార్హం. బోర్డు మెంబర్ భర్త కావడంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని భయపడి, సిబ్బందిని తిడుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటే, ఇలాంటి వారు తమ అనుచరులతో వచ్చి వీఐపీ హోదాను అడ్డం పెట్టుకుని హంగామా చేయడంపై సామాన్య జనం పెదవి విరుస్తున్నారు.
గతంలోనూ వివాదాలే
ఇంద్రకీలాద్రిపై ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా కొందరు ట్రస్ట్ బోర్డు సభ్యులు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేయడం, ప్రోటోకాల్ పేరుతో అధికారులపై ఒత్తిడి తేవడం వంటి ఘటనలు అనేకం జరిగాయి. గతంలో ఒక బోర్డు మెంబర్ ఏకంగా అమ్మవారి చీరల విషయంలో వివాదానికి గురికాగా, మరికొందరు అధికారుల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపిన సందర్భాలు ఉన్నాయి. తాజా ఘటనతో పాలక మండలి సభ్యుల ఎంపికలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ పరిరక్షకులు డిమాండ్ చేస్తున్నారు.






