రెవెన్యూ శాఖ మంత్రికి రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి

by Thanuru Gopichand |

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దని వినతి.

రెవెన్యూ శాఖ మంత్రికి రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా రాయచోటి (Rayachoti) ప్రాంత ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల దృష్ట్యా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును నిలిపివేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) కోరారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) కు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతిపై మంత్రి సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు.

సచివాలయంలో మంత్రి అనగానిని కలిసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో భూముల విలువను (Land Value) 200 నుంచి 300 శాతం వరకు పెంచారన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం మారినప్పటికీ పాత విలువలనే కొనసాగించడం వల్ల స్థిరాస్తి రంగం కుదేలవుతోందని వివరించారు. వాస్తవ మార్కెట్ ధరల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇది ప్రజలపై పెను భారంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న మార్కెట్ విలువల పెంపు ప్రతిపాదనను రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (SRO) పరిధిలో నిలిపివేయాలని మంత్రి మండిపల్లి కోరారు. అలాగే ప్రస్తుతం ఉన్న అధిక ఛార్జీలను తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని విన్నవించారు. ఈ విజ్ఞప్తిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ రాయచోటి ప్రజల ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని అన్నారు. రిజిస్ట్రేషన్ ధరల పెంపుదల అంశాన్ని పునఃసమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాయచోటి ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.

Next Story