అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం: కత్తులతో బెదిరించి 11 తులాల బంగారం దోపిడీ

by Naga Rani Yarlagadda |

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం: కత్తులతో బెదిరించి 11 తులాల బంగారం దోపిడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. బాపట్ల జిల్లా పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఒక భారీ రైలు దోపిడీ ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07154) లక్ష్యంగా దుండగులు ఈ దాడులకు తెగబడ్డారు.

నిద్రలో ఉండగానే దాడి..

రైలు బాపట్ల నుంచి అప్పికట్ల స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగులు పక్కా ప్లాన్‌తో రైలులోని S7, S11, S12, S13 స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడ్డారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను ఒక్కసారిగా నిద్రలేపి, కత్తులతో బెదిరిస్తూ బీభత్సం సృష్టించారు. ఎవరైనా ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తూ, వారి వద్ద ఉన్న సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నారు. దోపిడీ తర్వాత.. అప్పికట్ల సమీపంలో దుండగులు రైలు చైన్‌ను లాగి వేగాన్ని తగ్గించారు. రైలు ఆగీఆగగానే చీకట్లోకి దూకి పారిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

బాధితుల సమాచారంతో విజయవాడ రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పాత నేరస్థుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రైలు ప్రయాణాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో రైల్వే భద్రతా వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story