పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విషాదం.. అడిషనల్ ఎస్పీ రామ్‌ప్రసాద్ మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-27 04:13:25  IST  )

వినాయక చవితి పండుగ పూట పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విషాదం.. అడిషనల్ ఎస్పీ రామ్‌ప్రసాద్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి పండుగ వేళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత నెల 26న యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ అడిషనల్ ఎస్పీ కోకా రామ్‌ప్రసాద్ ఇవాళ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాదాపు నెల రోజుల పాటు ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అయితే, రామ్‌ప్రసాద్ మృతి పట్ల డిపార్ట్‌మెంట్‌లోని సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నారు.

కాగా, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న స్కార్పియో అదుపుతప్పి చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలివైపు పడింది. అటుగా వస్తున్న లారీ.. స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో డీఎస్పీలు చక్రధర్‌రావు (57), శాంతారావు(54) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నారు. ఇదే ప్రమాదంలో ఏఎస్పీ కోకా రామ్‌‌ప్రసాద్‌, డ్రైవర్‌ నర్సింగరావుకు తీవ్ర గాయాలు కాగా ఇవాళ రామ్‌ప్రసాద్ చికిత్స పొందుతూ మృతిచెందారు.

Next Story