మెడికల్ ​కాలేజీలపై.. విష ప్రచారం!

by Thanuru Gopichand |

కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరమంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు.

మెడికల్ ​కాలేజీలపై.. విష ప్రచారం!
X

- జగన్​ఒక్క కాలేజీని పూర్తి చేయలేదు

- కట్టని కాలేజీలపై వైసీపీకి ఎందుకంత హడావుడి?

- ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం

- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్

దిశ, డైనమిక్ ​బ్యూరో /ఏపీ బ్యూరో : కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరమంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు. మెడికల్ కాలేజీను ప్రభుత్వాలు నిర్వహించడం కన్నా ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. అంతేగాక పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య, విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపర్చడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కానీ వైసీపీ ఈ వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5వేల కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా సగంలో పెట్టి ఏదో జగన్ రెడ్డి సంపాదించి పెట్టిపోయిన ఆస్తిని అమ్మేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆగ్రహించారు. ఆర్థిక సమస్యలతో మూలనపడ్డ కాలేజ్ లను మళ్లీ పిపిపి విధానంలో పట్టాలు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

విచిత్రంగా జగన్ తీరు

సెల్ఫ్ ఫైనాన్స్ విధానమని మెడికల్ సీట్ల ఫీజును రూ.12 లక్షలు చేసి అమ్మకానికి పెట్టే విధానాన్ని తెచ్చిన జగన్ రెడ్డి నేడు పీపీపీ విధానాన్ని తప్పు పట్టడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. తాము 17 మెడికల్ కాలేజీలు కడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని జగన్ చేస్తున్నది విష ప్రచారం అని ఆగ్రహించారు. వైసీపీ ప్రభుత్వంలో మార్కాపురం కాలేజీని 17 శాతం, మదనపల్లె కాలేజీని 12 శాతం, పులివెందుల కాలేజీని 77 శాతం, ఆదోని కాలేజీ కేవలం 15 శాతం మాత్రమే పూర్తి చేశారని వివరించారు. 17 కాలేజీలు తెచ్చాను అని చెప్పుకున్న జగన్ ఒక్క మెడికల్ కాలేజీని సైతం స్పష్టం చేశారు. అన్ని కాలేజీలకు కలిపి రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా వైసీపీ హయాంలో కేవలం 17శాతం మాత్రమే ఖర్చు పెట్టారని వివరించారు.వైసీపీ హయాంలో 5 కాలేజీలు నిర్మించినట్లు చెప్పుకొంటున్న కాలేజీల్లోనూ క్లాసులు సైతం ప్రారంభం కాలేదని, కనీసం సిబ్బందిని కూడా నియమించలేదని చెప్పారు. హాస్టళ్లు అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ విధానం లేదని పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో అరకొర వసతులతోనే కళాశాలలు ప్రారంభమయ్యాయన్నారు. ఇవే ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి ఏంటని మంత్రి దుర్గేష్ వైసీపీని ప్రశ్నించారు.

పాడేరులో కాలేజ్ ఓపెన్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో పాడేరులో మెడికల్ కళాశాల ప్రారంభించిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. అదే విధంగా మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ కళాశాలల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన 10 కళాశాలలను వేగంగా పూర్తిచేసి, వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రెండు దశల్లో పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలలను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేసి, ఏడాదిలో కనీసం ఒక్కో కాలేజ్ లో 100 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఓ వైపు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి సీట్లు అందుబాటులోకి తెస్తుంటే ప్రైవేట్ పరం అంటూ గగ్గోలు చేస్తున్న వైసీపీకి విద్యార్థుల భవిష్యత్ పట్టదా? అని మంత్రి దుర్గేష్ నిలదీశారు. వైద్య విద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని మంత్రి అన్నారు. మొన్నటి వరకు రాజధాని మునిగిందని, విజయవాడను మళ్లీ వరదలు ముంచెత్తాయని విష ప్రచారం చేసిన వైసీపీ తాజాగా మళ్లీ మెడికల్ కాలేజీలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అన్నీ తెలిసినా కూడా వైసీపీ నేతలు జగన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేసింది వైసీపీ అని అన్నారు. కట్టని మెడికల్ కాలేజీలకు వైసీపీ నేతలు ఎందుకంత హడావిడి చేస్తున్నారో వారికే తెలియాలని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మెడికల్ కాలేజీలపై వైసీపీ విషం

- మంత్రి డీఎస్ బీవీ స్వామి

మెడికల్ కాలేజీలపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి డీఎస్ బీవీ.స్వామి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైసీపీ హయాంలో ఒక్క పైసా ఇవ్వలేదు అన్నారు. ఆస్పత్రులకు బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ఆరోపించారు. వైసీపీ కావాలనే దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏనాడు సత్యాలు మాట్లాడరు అని అన్నారు.

Next Story