నష్టాల సాకుతో ప్రైవేటీకరణ వైపు..? శ్రీకాళహస్తి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థపై నీలినీడలు!

by Kema Shiva Kumar |

శ్రీకాళహస్తిలోని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (AP Seeds) మూసివేత దిశగా అడుగులు వేస్తోంది.

నష్టాల సాకుతో ప్రైవేటీకరణ వైపు..? శ్రీకాళహస్తి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థపై నీలినీడలు!
X

దిశ, చిత్తూరు ప్రతినిధి: తూర్పున వరి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన శ్రీకాళహస్తిలోని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పుడు మనుగడ కోసమే పోరాడాల్సిన దుస్థితికి చేరుకుంది. దశాబ్దాలుగా అన్నదాతకు నాణ్యమైన విత్తనాన్ని అందిస్తూ, భరోసాగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు మూసివేత దిశగా అడుగులు వేయడం రాయలసీమ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒకప్పుడు విత్తన శుద్ధితో కళకళలాడిన గోదాములు, నేడు బహుళజాతి కంపెనీల సరుకుల నిల్వకు కేటాయించబడటం రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

కోకా కోలాకు అద్దెకు కేటాయింపు

ఏపీసీడ్స్ సంస్థకు చెందిన సుమారు 57,552 చదరపు అడుగుల భారీ గోదామును ప్రైవేటు పరిశ్రమ అయిన కోకా కోలాకు అద్దెకు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదరపు అడుగుకు కేవలం రూ.8.50 వంతున, నెలకు రూ.4,89,192 అద్దెకు మూడు నెలల కాలపరిమితితో ఉన్నతాధికారులు కేటాయించారు. మూడు రోజుల క్రితమే దీనికి సంబంధించిన రహస్య ఉత్తర్వులు వెలువడగా, అవి గురువారం వెలుగులోకి రావడంతో రైతులు, కార్మికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఇలా ప్రైవేటు పరం చేయడమే మూసివేతకు తొలి అడుగు అని వారు ఆరోపిస్తున్నారు.

అధికారుల వాదన.. నష్టాల సాకు!

విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు మాత్రం తాము లాభనష్టాల లెక్కల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. గత ఏడేళ్లుగా గోదాములు ఖాళీగా ఉన్నాయని, తగినంత 'సీడ్' రావడం లేదని వారు సాకులు వెతుకుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేకపోతున్నామని, విత్తనం కేజీకి రూ.22 చొప్పున భారీగా నష్టం వస్తోందని వారు వివరిస్తున్నారు. 2024-25లో 15 లారీలు, 2025-26లో 10 లారీల విత్తనాన్ని నష్టానికి అమ్మామని, ఏటా కోట్లాది రూపాయల భారమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

రైతుల ఆగ్రహం

అధికారుల మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని రైతులు మండిపడుతున్నారు. 1977లో స్థాపించబడిన ఈ కర్మాగారం రాయలసీమ వ్యాప్తంగా వరి విత్తనాలను సరఫరా చేసేది. కానీ, గత కొంతకాలంగా కొందరు మేనేజర్ల నిర్లక్ష్యం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందడం లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో రైతులు సంస్థపై నమ్మకాన్ని కోల్పోయారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నష్టాల సాకుతో గోదాములను అద్దెకు ఇస్తున్నారని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. "లక్షలాది మందికి అన్నం పెట్టే కర్మాగారాన్ని ప్రైవేటు కూల్ డ్రింక్ కంపెనీకి ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం?" అని ఆయన నిలదీశారు.

ముంచుకొస్తున్న కష్టకాలం

ఏపీ సీడ్స్ మూతబడితే చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల రైతులు విత్తనాల కోసం ప్రైవేటు వ్యాపారుల చెంతకు చేరాల్సి వస్తుంది. కల్తీ విత్తనాలు, అధిక ధరలతో సాగు భారమై రైతాంగం చితికిపోయే ప్రమాదం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి, సమర్థవంతమైన అధికారులను నియమించి ఈ కర్మాగారానికి పునర్జీవం పోయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల నిరసన

ఏపీసీడ్స్ అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు గురువారం నిరసన తెలిపారు. అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ సీడ్స్ యూనియన్ ప్రెసిడెంట్ మున్నయ్య, ఈశ్వర్ రెడ్డి, సభ్యులు బాబు, ముని రామయ్య, కార్మికులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరిస్తూ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

Next Story