ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు నామినేషన్లకు ఆఖరు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 02:26:41  IST  )

మొదలైన పొలిటికల్ హీట్. టిక్కెట్ల కోసం ఆశావహుల ఫీట్స్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు నామినేషన్లకు ఆఖరు
X

దిశ, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ మొదలైంది. దీంతో బల్దియా ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కీలకమైన నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా..తొలి రోజు నామ మాత్రంగానే దాఖలయ్యాయి. నామినేషన్లకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం..అంతలోనే ఒక రోజు ముగిసిపోవడంతో ఆశావాహ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.తాజాగా రెండో రోజు గురువారం భారీగా దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన బరిలో ఉండే అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక్కొక్కరు రెండేసి సెట్లు వేశారు. ఒక్కో వార్డు నుంచి దాదాపు నలుగురి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా మారుతోంది. పార్టీల తరపున నామినేషన్లు వేసిన వారితో పాటు అనేకమంది స్వతంత్రులు సైతం ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారీగా నామినేషన్లు దాఖలు..

జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో తొలి రోజు నామ మాత్రంగానే దాఖలు కాగా..రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.ఉదయం 10. 30 గంటల నుంచే ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి వరుస కట్టారు.సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒక్కొక్కరు వచ్చి దాఖలు చేయడం కనిపించారు.అటు మున్సిపల్ కార్యాలయంలోనూ ఇంటి పన్నుల బకాయిలు చెల్లించేందుకు అభ్యర్థులు భారీగా తరలి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు అనేకమంది స్వతంత్రులు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది వరకు నామినేషన్లు వేసిన వారు సైతం చివరి రోజున మరో సెట్ వేసేందుకు వచ్చే అవకాశం ఉండటంతో భారీగా దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

బీ ఫారంల కోసం ఎదురుచూపులు..

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు ఆయా ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీల తరపున నామినేషన్లు దాఖలు చేసినప్పటికి బీ ఫారంల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకున్నా బరిలో ఉండాలని భావిస్తున్న వారు నామినేషన్ ఫారాల్లో పార్టీ పేర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం ఆయా పార్టీల కీలక నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.ఆయా పార్టీ కార్యాలయం.. లేకుంటే నాయకుల ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నాయకుల నోటి మాటతో టికెట్లు కన్ఫామ్ అయిన వారు మాత్రం ధీమాగా ఉండగా.. టికెట్ హామీ దక్కని వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ దక్కకపోతే ఇతర గుర్తింపు కలిగిన పార్టీల నుంచి పోటీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కాలనీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు.. బరిలో ఉండాలని భావిస్తున్నవారు పార్టీలు మారుతున్నారు. టికెట్ దక్కని వారు ఒకటి రెండు రోజుల్లో మరింత మంది పార్టీలు మారి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల సమయంలో కండువాలు మార్చడం సాధారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల వేల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీ ఫారాలు సమర్పించేందుకు ఫిబ్రవరి 3 వరకు సమయం ఉండటంతో ఎవరికీ దక్కుతాయోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఆదిలాబాద్లో 149 నామినేషన్లు..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. కాగా ఆదిలాబాద్ మున్సిపల్ లో పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో గురువారం 149 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్-35, కాంగ్రెస్-65, బీజేపీ-26, మిగితా పార్టీలు-13, స్వతంత్రులు-8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా నేటితో సమయం ముగియనుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Next Story