- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala update : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) బిగ్ అలర్ట్ జారీ చేసింది. 12 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) బిగ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 7 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం (Lunar Eclipse) కారణంగా ఆలయాన్ని కొన్ని గంటలపాటు మూసివేస్తున్నట్లు తెలిపింది. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుండటంతో.. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 గంటల నుంచి మరుసటిరోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకూ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని పదకొండున్నర గంటలపాటు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి.. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
అలాగే గ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసినట్లు తెలిపింది. వీటితో పాటు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం 8.30 గంటల వరకూ భక్తులకు అన్నప్రసాదాల వితరణ సైతం నిలిపివేస్తున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, పీఏసీ -2లలో అన్నప్రసాదాల వితరణను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా భక్తులకు 30 వేల పులిహోర ప్యాకెట్లను ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ -1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం నుండి టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల తలుపులు మూసివేస్తారు.






