దేశవ్యాప్తంగా మూతపడనున్న ఆలయాలు.. తిరుమల సర్వదర్శనం క్యూలైన్ మూసివేత

by Naga Rani Yarlagadda |

నేడు చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలతోపాటు.. దాదాపు అన్ని ఆలయాలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మూతపడనున్నాయి.

దేశవ్యాప్తంగా మూతపడనున్న ఆలయాలు.. తిరుమల సర్వదర్శనం క్యూలైన్ మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలతోపాటు.. దాదాపు అన్ని ఆలయాలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మూతపడనున్నాయి. రేపు ఉదయం ఆలయాల శుద్ధి, ఇతర సేవల అనంతరం తిరిగి భక్తులకు దేవదేవతుల దర్శన భాగ్యం కలగనుంది. తిరుమల శ్రీవారి ఆలయం సైతం మధ్యాహ్నం 3.30 గంటలకు మూతపడనుంది. స్వామివారి సర్వదర్శనం క్యూ లైన్ ను ఆదివారం ఉదయమే టీటీడీ మూసివేసింది. ప్రస్తుతం క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించనుంది. తిరిగి రేపు ఉదయం సుప్రభాతసేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపింది. గ్రహణం కారణంగా ప్రతినెలా నిర్వహించే పౌర్ణమి గరుడసేవను సైతం రద్దుచేసింది. మరోవైపు శ్రీశైలం మల్లన్న ఆలయం మధ్యాహ్నం 1 గంటకు మూతపడనుంది. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. తెలంగాణలోనూ యాదాద్రి, భద్రాచలం, వేములవాడ రాజన్న, బాసర సరస్వతీదేవి, హైదరాబాద్ పెద్దమ్మ గుడి, చిలుకూరు బాలాజీ ఆలయం వంటి ప్రధాన ఆలయాలు సహా అన్ని ఆలయాలను మూసివేయనున్నారు.

నేటి రాత్రి 9.50 గంటల నుంచి అర్థరాత్రి 1.31 గంటల వరకూ గ్రహణం ఉండగా.. 82 నిమిషాలపాటు ఆకాశంలో బ్లడ్ మూన్ కనిపించనుంది. గ్రహణ సమయంలో చంద్రుడు అత్యంత ఎర్రగా మారనుండగా.. ఈ దృశ్యం ప్రపంచంలో 85 శాతం మందికి కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించనుంది.

Next Story