- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండలిలో 'లడ్డూ' పోరు: వైసీపీ - కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం శాసనమండలిని కుదిపేస్తోంది. ఎప్పుడు ఈ అంశంపై చర్చించినా వైసీపీ నేతలు అడ్డుకోవడంపై మంత్రులు ఫైరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర దుమారం రేపింది. ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం సమగ్ర వివరాలతో కూడిన 20 పేజీల ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసింది. లడ్డూ చారిత్రక నేపథ్యం, తయారీలో వాడే ప్రామాణిక పదార్థాలు, పోటు-మిరాసీ వ్యవస్థ వంటి కీలక అంశాలను ప్రభుత్వం ఈ నివేదికలో పొందుపరిచింది.
నివేదికలో వాస్తవాలు.. సభలో గందరగోళం
లడ్డూ కల్తీ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పిన మాట కాదని, ఎన్‌డీడీబీ (NDDB) ఇచ్చిన శాస్త్రీయ నివేదిక ఆధారంగానే ఆరోపణలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయితే.. చర్చా సమయంలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే అంశంపై రెండు తీర్మానాలు ఇవ్వడం సరికాదని మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సభలో కొత్త సంప్రదాయాలకు తెరలేపవద్దని ఛైర్మన్‌ను కోరారు.
తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు: పయ్యావుల
సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్న వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పేటప్పుడు వాకౌట్ చేయకుండా వినే ధైర్యం వైసీపీ సభ్యులకు ఉండాలన్నారు. దోషులను ప్రజల ముందు నిలబెట్టిన తర్వాతే మేము బయటకు వెళ్తాం అని ఆయన స్పష్టం చేశారు. సభలో చర్చించేందుకు తాము ఎంతసేపైనా సిద్ధమని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సమాధానానికి సమయ నిబంధనలు వర్తించవని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సభలో అందరూ మాట్లాడితే వాస్తవాలేంటో ప్రజలకు కూడా తెలుస్తాయన్నారు.
వాకౌట్ రాజకీయం వద్దు: అచ్చెన్నాయుడు
వైసీపీ సభ్యులు తాము మాట్లాడిన తర్వాత సభ నుంచి వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అలా జరగకుండా ఛైర్మన్ కఠిన చర్యలు తీసుకోవాలని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం లడ్డూ కల్తీపై చర్చ కొనసాగుతుండటంతో మండలిలో ఉత్కంఠ నెలకొంది. చారిత్రాత్మక తప్పిదాలు మండలి వేదికగా జరగకూడదన్నదే తమ ఉద్దేశమని కూటమి మంత్రులు పునరుద్ఘాటించారు. వైసీపీ లడ్డూ కల్తీ నెయ్యి అంశంలో పీకల్లోతులో కూరుకుపోయిందని, దానినుంచి ఎలా బయటికి రావాలో తెలియక సతమతమవుతోందని ఆరోపించారు. లడ్డూ అంశంపై చర్చకు వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రి సమాధానానికి 10 నిమిషాలు సమయం కేటాయించామని ఛైర్మన్ మోషేనురాజు తెలుపగా.. పార్టీలకు నిర్దేశిత సమయం ఉంటుంది, ప్రభుత్వ సమాధానానికి సమయం నిబంధన వర్తించదని పయ్యావుల కేశవ్ తెలిపారు. సభలో అన్ని పార్టీలకు సమయం ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. దాంతో తాను సభా నియమాల ప్రకారమే సభను నిర్వహిస్తున్నానని ఛైర్మన్ బదులిచ్చారు.






