తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

by Thanuru Gopichand |

చంద్రగ్రహణం నేపథ్యంలో టీటీడీ అధికారుల కీలక నిర్ణయం.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్ది రోజుల వరకు తిరుమల (Tirumala) భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి, ఇతర సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. రెండు రోజుల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల (Devotees) సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో కొండపై భక్తుల తాకిడి తగ్గుతోంది. శుక్రవారం ఉదయం వేళ వరకు మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ (TTD) అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల (8 Hours) సమయం పడుతోందని తెలిపారు. గురువారం 61,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. 22,076 మంది తలనీలాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారని అన్నారు. రూ.4.76 కోట్ల రూపాయలు హుండీ కానుకలుగా (Hundi Kanukalu) వచ్చాయని ప్రకటించారు.

మార్చి 3న శ్రీవారి ఆలయం మూత

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా పేర్కొన్నారు. సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుందని వెల్లడించారు.

ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగిందని ప్రకటించారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరారు.

Next Story