- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్తిపాడు మన్యంలో పులి కలకలం.. వణికిపోతున్న పల్లెలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మన్యం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మన్యం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా శంఖవరం మండలంలోని పలు గ్రామాల్లో పులి కదలికలు స్పష్టంగా కనిపిస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శంఖవరం మండల పరిధిలోని అచ్చంపేట, కొత్తూరు, ఎస్.జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో పెద్దపులి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పులి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
రాకపోకలపై ఆంక్షలు..!
పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పులిని బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే బోన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక పరికరాలు, కెమెరాల సాయంతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి, ప్రజల రక్షణ దృష్ట్యా కొన్ని గ్రామ రహదారులపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇక, పులి భయం పొలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాగు పనుల కోసం పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు, కూలీలు భయపడుతున్నారు. పశువుల కాపరులు తమ పశువులను అడవి వైపు తీసుకెళ్లేందుకు సాహసించడం లేదు. రాత్రి సమయాల్లో బయటకు రావద్దని, సమూహాలుగా ఉండాలని అధికారులు గ్రామాల్లో హెచ్చరిస్తున్నారు.






