మన్యంలో మళ్లీ పులి కలకలం.. ఆవు దూడపై దాడి-గ్రామాల్లో భయాందోళన

by Ramesh Naini |

పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

మన్యంలో మళ్లీ పులి కలకలం.. ఆవు దూడపై దాడి-గ్రామాల్లో భయాందోళన
X

దిశ, రాజవొమ్మంగి : పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చికిలింత పంచాయతీ పరిధిలోని దుర్గా నగర్ సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం మేతకు వెళ్లిన ఆవు దూడపై పెద్దపులి దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దాడిలో ఒక దూడ మృతి చెందినట్లు, మరో లేగదూడ తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలు, జంతువుల అవశేషాలు కనిపించడంతో ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. గత కొద్ది రోజులుగా పులి జాడ కనిపించకపోవడంతో స్థానికులు సాధారణంగా అడవి ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించగా, తాజాగా మళ్లీ పులి సంచారం బయటపడటంతో దుర్గా నగర్, చికిలింత, పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది.

అంచు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దు..

ముఖ్యంగా పశువులను మేతకు తీసుకెళ్లే రైతులు, గిరిజనులు తీవ్ర భయంతో ఉన్నారు. దీంతో పులి సంచారం సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. పులి అడుగుజాడలను గుర్తించిన అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. అడవి అంచు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పశువులను అడవికి సమీప ప్రాంతాలకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కూడా రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాల పరిసరాల్లో పెద్ద పులి సంచారం కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే. వరుసగా పులి ఆనవాళ్లు బయట పడుతుండటంతో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పులి కదలికలను గుర్తించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story