ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్

by Ramesh Naini |   (  Updated:2025-11-25 11:44:34  IST  )

ఏపీలో జిల్లాల జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు.

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో జిల్లాల జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. గతంలోనే అనుకున్న మార్కాపురం (ప్రస్తుతం ప్రకాశం జిల్లా), మదనపల్లి (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) జిల్లాల ఏర్పాటుకు సీబీఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష అనంతరం మార్పు చేర్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటును ఖరారు చేశారు. అవసరం మేరకు, పరిమిత స్థాయిలోనే మార్పులు, చేర్పులు ఉండాలని అధికారులకు తెలిపారు. జిల్లాల సరిహద్దులు మార్పు, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుపై సీఎం సూచనలు చేశారు. ఈ మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

Next Story