ఘోర ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

by Naga Rani Yarlagadda |

పాడేరులో జరిగిన రోడ్డుప్రమాదం ముగ్గురు స్నేహితుల్ని బలితీసుకుంది. శివరాత్రి జాతరలో ఆనందంగా గడిపిన వారు.. విగతజీవులవ్వడంతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘోర ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది. ముగ్గురు స్నేహితులను మలుపు బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా వంతలగుమ్మి సమీపంలో చోటుచేసుకుంది. గెమ్మలి రమేశ్ (22), సిదరి శ్రీధర్ పౌలు (17), రేగం సూర్యప్రకాష్ (21)లు స్నేహితులు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హుకుంపేట మండలంలో జరిగిన మత్స్యగుండం జాతరకు వెళ్లారు. జాతర పూర్తయ్యాక తిరిగి సొంతూళ్లకు టూ వీలర్ పై వస్తుండగా.. వంతలగుమ్మి సమీపంలో ఓ మలుపువద్ద రెండు విద్యుత్ స్తంభాల మధ్యలో నుంచి వెళ్లి ఇంటిగోడను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్లో చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శివరాత్రికి స్నేహితులంతా కలిసి ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తుచేసుకున్న కుటుంబాలు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకులు రోడ్డుప్రమాదంలో మరణించడంతో.. మూడు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఈ ప్రమాద ఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story