- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ క్రీడారంగంలో తీవ్ర సంక్షోభం.. శాప్‌లో మూడు దశాబ్దాల నిరీక్షణ
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో కోచ్‌ల నియామకాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో కోచ్‌ల నియామకాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దాదాపు మూడు దశాబ్దాలుగా రెగ్యులర్ కోచ్ పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో రాష్ట్ర క్రీడా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని క్రీడా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడా అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత, ప్రభుత్వం తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
1989 తర్వాత నిలిచిపోయిన రిక్రూట్మెంట్
శాప్‌లో ప్రస్తుతం దాదాపు 52 కోచ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. 1989 తర్వాత కోచ్ పోస్టుల కోసం ఎలాంటి రెగ్యులర్ రిక్రూట్మెంట్ నిర్వహించలేదని క్రీడా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ, శాశ్వత కోచ్‌ల నియామకాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పైనే భారం
ప్రస్తుతం శాప్‌లో పనిచేస్తున్న కోచ్‌లలో అధిక శాతం కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో సుమారు 100 మంది కోచ్‌లు, కాంట్రాక్ట్ పద్ధతిలో మరో 35 మంది కోచ్‌లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శాశ్వత ఉద్యోగ భద్రత లేకపోవడంతో కోచ్‌లలోనూ అసంతృప్తి నెలకొంది. తక్కువ వేతనాలు, పదోన్నతుల అవకాశాలు లేకపోవడం, భవిష్యత్‌పై అనిశ్చితి వంటి సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. రెగ్యులర్ కోచ్‌ల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడాకారుల ప్రతిభాభివృద్ధి దెబ్బతింటోంది. ప్రతి జిల్లాలో అన్ని క్రీడలకు ప్రత్యేక శిక్షణ అవసరమైన సమయంలో తాత్కాలిక నియామకాలతోనే వ్యవస్థ నడపడం వల్ల క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త జిల్లాల్లో కోచ్‌లు, సిబ్బంది లేక ఇబ్బందులు
రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని క్రీడా సంఘాలు చెబుతున్నాయి. అనేక జిల్లాల్లో సరిపడా కోచ్‌లు, సిబ్బంది లేకపోవడంతో క్రీడా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కనీస స్థాయి క్రీడా మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని, స్టేడియాలు, శిక్షణ కేంద్రాలు ఉన్నా కోచ్‌లు లేక ఉపయోగం లేకుండా పోతున్నాయని విమర్శిస్తున్నారు. కొత్త జిల్లాల్లో క్రీడాకారులు శిక్షణ కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువత క్రీడలపై ఆసక్తి కోల్పోతున్నారని క్రీడా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. క్రీడా కోటా ఉద్యోగాలు, జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర ప్రతిభ పెంపు, ఒలింపిక్ లక్ష్యాల సాధన వంటి అంశాల్లో నాణ్యమైన కోచ్‌ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వం వెంటనే స్పందించి శాప్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసి క్రీడాకారులకు న్యాయం చేయాలని క్రీడా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
నగదు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూపులు
రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నగదు ప్రోత్సాహకాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పేరు పొందిన, పలుకుబడి ఉన్న క్రీడాకారులకు మాత్రమే ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోందా అనే చర్చ క్రీడా వర్గాల్లో జరుగుతోంది. జాతీయస్థాయిల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను పట్టించుకోవడం లేదని, పలుకుబడి ఉంటేనే ఫైల్ కదులుతుందని విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పతకాలు సాధించినప్పటికీ, వారికి ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






