- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ పతనానికి ఆ ఐదుగురే కారణం.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YCP) 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోవడానికి ఆ పార్టీ నేతల అహంకారపూరిత ప్రవర్తన, అడ్డగోలు భాషే ప్రధాన కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YCP) 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోవడానికి ఆ పార్టీ నేతల అహంకారపూరిత ప్రవర్తన, అడ్డగోలు భాషే ప్రధాన కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పతనానికి జోగి రమేష్, అంబటి రాంబాబు, పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలే కారణమని దుయ్యబట్టారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ నేతలు అత్యంత అసభ్యకరంగా మాట్లాడుతుంటే జగన్ మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) పక్కన కూర్చుని నవ్వుతూ ప్రోత్సహించారే తప్ప ఎప్పుడూ ఖండించలేదని ఆరోపించారు. నాడు వారు చేసిన పాపాలే నేడు ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేశాయని మండిపడ్డారు. ఇక పవిత్రమైన తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన రూ.240 కోట్ల కల్తీ నెయ్యి కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని అన్నారు. కానీ, ఇంత పెద్ద స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఇప్పుడు అంబటి రాంబాబును ఓ పావులా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు నిరంతరం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆక్షేపించారు.
తెరపైకి కులం కార్డు..
వైసీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీసీ, కాపు కార్డులను వాడుకోవడంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై ప్రత్యక్షంగా దాడులు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడు వారు కాపులు, బీసీలు అని జగన్‌కు గుర్తుకు రాలేదా..? కేవలం తమ రాజకీయ లబ్ధి కోసమే కులాలను వాడుకోవడం వైసీపీ నైజమా అని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పినా.. ఆ పార్టీ నేతల్లో ఇంకా మార్పు రావడం లేదని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మసలుకోవాలని నిమ్మల రామానాయుడు అన్నారు.






