రాష్ట్రంలో జిమ్ ఉన్న ఏకైక పోలీస్ స్టేష‌న్ ఇదే: Home Minister Anitha

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-02 08:40:41  IST  )

ఏపీలోని విజయవాడలో ఇవాళ(సోమవారం) నూతనంగా నిర్మించిన సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ ప్రారంభం ఘనంగా జరిగింది.

రాష్ట్రంలో జిమ్ ఉన్న ఏకైక పోలీస్ స్టేష‌న్ ఇదే: Home Minister Anitha
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడలో ఇవాళ(సోమవారం) నూతనంగా నిర్మించిన సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ ప్రారంభం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(సోమవారం) రాష్ట్రంలో మోడ‌ల్ పోలీస్ స్టేష‌న్ల‌లో సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ టాప్ అని తెలిపారు. కొన్ని పోలీస్ స్టేష‌న్ల‌కు వ‌స్తే బాధ‌పెరుగుతుంది. కానీ.. ఈ పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తే కార్పొరేట్ ఆఫీస్‌కు వ‌చ్చిన ఫీలింగ్ క‌లిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

ఇవాళ ప్రారంభించిన ఈ మోడ‌ల్ పోలీస్ స్టేష‌న్ 320 గ‌జాల్లో సుమారు రూ.2.50 కోట్ల‌తో అద్భుతంగా క‌ట్టారు. ఇక్క‌డ ఏసీపీ నుంచి హెడ్ కానిస్టేబుల్ వ‌ర‌కు ప్ర‌త్యేక రూమ్ అందుబాటులో ఉంది. రాష్ట్రంలో జిమ్ (వ్యాయామ‌శాల‌) ఉన్న ఏకైక పోలీస్ స్టేష‌న్ కూడా ఇదే అని ఆమె తెలిపారు. పోలీసులు శారీర‌కంగా, మెంట‌ల్ ప్రెజ‌ర్ త‌ట్టుకునేందుకు యోగా, జిమ్ రూమ్ అందుబాటులో ఉన్నాయి.

మ‌హిళ‌లు ఫిర్యాదు చేయ‌డానికి వ‌స్తే వారి పిల్ల‌లు ఆడుకోవ‌డానికి ప్లేయింగ్ జోన్ ఏర్పాటు చేశారు. గ‌త ఏడాది కాలంగా విజ‌య‌వాడ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో.. ముఖ్యంగా స‌త్య‌నారాయ‌ణపురం పీఎస్ ప‌రిధిలో రైల్వే ష్టేష‌న్, గంజా బ్యాచ్, ధ‌ర్నా చౌక్ ఇలా చాలా హాట్ స్పాట్స్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంత‌మిది. అందుకే ఈ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయ‌డం ముఖ్య‌మ‌ని భావించి.. దాదాపు 200 కెమెరాలు ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు.

పోలీస్ స్టేష‌న్ చుట్టూ 10 కెమెరాలు.. రౌడీషీట‌ర్లు ప్ర‌తి ఆదివారం సంత‌కం చేయాలి. వారు వ‌చ్చారా? లేదా? అని గుర్తించ‌డానికి ఫేస్ రిక‌గ్నిష‌న్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టెక్నాల‌జీని అందిపుచ్చుకుని నేరాల నియంత్ర‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నాం. విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న ఎక్కువ‌. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో మేము భాగ‌స్వాముల‌వుతామ‌ని ముందుకు వ‌స్తున్నారు. స్థానిక ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచ‌డంలోనూ పోలీసులు స‌క్సెస్ అయ్యారని హోం మంత్రి అనిత తెలిపారు.

తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తించి కెమెరాల్లో ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిశీలిస్తూ.. దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఏ నేరం జ‌రిగినా 24 గంట‌ల్లో నిందితుల‌ను పోలీసులు ప‌ట్టుకోగ‌లుగుతున్నారు అంటే.. ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే సాధ్యం. పోలీసులు లేక‌పోయినా డ్రోన్ రోజూ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో తిరుగుతూ ఉంటాయి. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతోపాటు భ‌రోసా ఇవ్వ‌డం ఒక‌వైపు.. మ‌రోవైపు నేర‌స్తుల సంఖ్య త‌గ్గించ‌డం ముఖ్య ఉద్దేశ్యం.

రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం.. ఆ దిశ‌గా ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. గంజాయిని అరిక‌ట్టేందుకు ఈగ‌ల్ టీమ్ కీల‌కంగా ప‌నిచేస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో గంజాయి సాగు త‌గ్గింది. ఒడిశా పోలీసుల‌తో ఈ వారంలో మ‌న డీజీపీ గారు స‌మావేశం అవుతారు. జూన్ 21న విశాఖ‌లో నిర్వ‌హించ‌నున్న‌ యోగా డే కి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌ర‌వుతున్నారు. నెల రోజుల పాటు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశాం.. మా పోలీసులు కూడా 5 వేల మందితో యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించామని హోం మంత్రి అనిత వెల్లడించారు.

Next Story