రప్పా.. రప్పా నరుకుతామంటూ రెచ్చిపోయారు

by Thanuru Gopichand |

ప్రజల మధ్య ద్వేషాలు పెంచుతున్న రాజకీయాలు.

రప్పా.. రప్పా నరుకుతామంటూ రెచ్చిపోయారు
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2 సినిమాలోని రప్పా రప్పా (Rappaa Rappaa) డైలాగ్ ఇప్పుడు రాజకీయంలో ఊత పదంగా మారుతోంది. ముఖ్యంగా ఏపీలోని రాజకీయ పార్టీలు పదాన్ని విరివిగా వాడేస్తున్నాయి. అందులోనూ వైసీపీ కార్యకర్తలు తాము అధికారంలోకి వస్తే అంతా రప్పా రప్పానే అంటో ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రప్పా రప్పా 2.0 అని పోస్టరు పెట్టిన కారణంగా కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన యువకులపై కేసు నమోదు అయ్యి జైలుకు కూడా వెళ్లారు. ప్రభుత్వం కూడా రప్పా రప్పా అంటే రఫాడిస్తామని ఓ పక్క హెచ్చరిస్తూనే ఉంది. కానీ కొందరు వైకాపా కార్యకర్తల్లో మార్పు రావడం లేదు. మరోసారి రప్పా రప్పా అంటూ వారు చెలరేగిపోవడంతో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఎన్టీఆర్ జిల్లాలోని (NTR District) నందిగామలో (Nandigama) బిగ్గరగా నినాదాలు చేస్తూ టీడీపీ నేతలను టార్గెట్ చేశారు వైసీపీ కార్యకర్తలు.

పోలీసుల వివరాల ప్రకారం మద్యం సేవించిన వైసీపీ (YCP) కార్యకర్తలు నందిగామలో అర్థరాత్రి హల్ చల్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వారిని టీడీపీ (TDP) కార్యకర్తలు వారించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా గొడవకు దారి తీసింది. అసలే మద్యం సేవించి ఉన్నారు.. మైకంలో ఏం చేస్తున్నారో తెలుస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి. అదే మత్తులో టీడీపీ కార్యకర్తలపైకి విరుచుకుపడ్డారు వైసీపీ కార్యకర్తలు. రాళ్లను చేతబుచ్చుకొని టీడీపీ కార్యకర్తలపైకి రువ్వడం ప్రారంభించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో కొందరు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. అయితే గొడవ అవుతున్న క్రమంలో అధికారంలోకి రాగానే రప్పా రప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు హెచ్చరించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒక కార్యకర్త అయితే మరీ రెచ్చిపోయి ప్రవర్తించినట్లు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన ఇరు పార్టీల కార్యకర్తలను చికిత్స నిమిత్తం హాస్పిటలుకు తరలించారు. గొడవ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story