అమ్మేది లేదంటూనే అదానీ చేతిలో పెడుతున్నారు : వైయస్ షర్మిల

by Thanuru Gopichand |

విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ను అమ్మేది లేదని చెబుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్లాంట్ ను మెల్లగా అదానీ చేతిలో పెడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు.

అమ్మేది లేదంటూనే అదానీ చేతిలో పెడుతున్నారు : వైయస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ను అమ్మేది లేదని చెబుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్లాంట్ ను మెల్లగా అదానీ చేతిలో పెడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎక్స్ వేదికగా తన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని గుప్పించారు. విశాఖపట్నం స్లీట్ ప్లాంట్ విషయంలో బిజెపి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ఒకవైపు చెబుతోంది.. ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదని అంటోందని.. విశాఖ ఉక్కు సంస్థను ఆదుకుంటామని చెబుతోందని అన్నారు. కానీ మరో వైపు చాపకింద నీరులా ప్రైవేటీకరణ వైపు పావులు కదుపుతూ అదానీ చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, కార్మికుల ఆగ్రహాన్ని చల్లబరచడానికి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. తెర ముందు గొప్పగా మాటలు మాట్లాడుతూ తెర వెనుక అదానీ చేతిలో ప్లాంట్ ను పెట్టేందుకు స్కెచ్చులు వేస్తున్నారని ఆరోపించారు.

ప్రధానమంత్రి సైలెంట్ కిల్లింగ్ విధానాన్ని అవలంబిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఉద్యోగులకు ఒక్కొక్కరిగా తప్పిస్తున్నారని విమర్శించారు. కొత్త నియామకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అడ్డికి పావుసేరు లెక్కన ప్లాంట్ భూములను అదానీకి ధారాదత్తం చేయ చూస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుకు ఉరి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని వనరులను ఒక్కొక్కటిగా అదానీకి అప్పగిస్తూ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్ గా మార్చాలని చూస్తున్నారంటూ విమర్శనాస్త్రాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే కుట్రలో కూటమి పార్టీల నేతలు క్రియాశీలురైతే ప్రధానమంత్రి అందుకు కర్త అని ఆరోపణలను గుప్పించారు. ఒక చేత్తో సాయం చేస్తున్నట్లు నటిస్తూ మరో చేత్తో గుంజుకుంటున్నారని అన్నారు. పొమ్మనలేక పొగబెట్టుతున్న చందాన నష్టాల సాకు చూపి ఉద్యోగులను వేధిస్తున్నారని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికొద్ది జీతమని ప్రపంచంలో లేని రూల్స్ ను పెడుతున్నారన్నారు. టెండర్ల పేరుతో ముక్కలుగా కోసి విడిభాగాలుగా అమ్మకానికి పెట్టి, ప్రతి అడుగూ ఆదానీకి దగ్గర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారని.. ఇంత చేస్తూ స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉందని గొప్పలు చెప్పడానికి బీజేపీకి ఏ మాత్రం మొహమాటం లేకుండా పోయిందన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్నారు. తెలుగవారి ఆత్మగౌరవంపై గౌరవం ఉంటే అదానీకి కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ను ఎస్ఏఐఎల్ లో విలీనం చేస్తున్నట్లు హామీనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రకటన చేయించాలని పిలుపునిచ్చారు.

Next Story