- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధం ప్రభావం ఉందని కుంగిపోవాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై ఉందని కుంగిపోవాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. ఇలాంటి సమయంలోనే అందరం ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రుల ఆత్మగౌరవం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తన ప్రాణాలనే అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శాఖమూరులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, బిజెపి నేత మాధవ్ కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక పోస్టల్ కవర్‌ను కూడా విడుదల చేశారు.
ఇది స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ : సీఎం చంద్రబాబు
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఏపీలో దీనిని 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల విగ్రహం)గా అభివర్ణించారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహారదీక్షకు గుర్తుగానే 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలుగు వారికి గుర్తింపు లేని రోజుల్లో మన సత్తా చాటిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కేవలం రాష్ట్రం కోసమే కాకుండా, దళితులకు ఆలయ ప్రవేశం కోసం కూడా ఆయన 29 రోజుల పాటు పోరాడారని గుర్తు చేశారు. 2019-24 మధ్య రాజధానిని మూడు ముక్కలాటగా మార్చి, అసలు రాజధానే లేని పరిస్థితి తెచ్చారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడు అమరావతి మళ్లీ ప్రజా రాజధానిగా అభివృద్ధి చెందుతోందని, రాజధాని అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి కేంద్ర బిందువని స్పష్టం చేశారు.
తెలుగు జాతి వివిధ సమయాల్లో విడిపోయి.. వివిధ సందర్భాల్లో కలిసి ఉందన్నారు. ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజధాని రైతుల త్యాగాన్ని పట్టించుకోకుండా ఆటలాడటం చూస్తుంటే బాధేస్తోందన్నారు. 2019-24 మధ్యకాలంలో రాజధాని రైతుల పోరాటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై ఉందని కుంగిపోవాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. వివిధ రకాల ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఇబ్బందులు వస్తున్న విషయం వాస్తవమేనన్న సీఎం.. ఇలాంటి సమయంలోనే అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అభివృద్ధి ఆగకూడదన్నారు.
అమరజీవి జలధార పథకం ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్‌కు 'అమరజీవి జలధార' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. నీరు తాగే ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు పేరును స్మరించుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. దాదాపు రూ.10 వేల కోట్లతో 7 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని, వీటన్నింటినీ అమరజీవి పేరుతోనే ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. తెలుగు జాతి ఉనికి కోసం ఆత్మార్పణ చేసిన గొప్ప వ్యక్తి శ్రీరాములు అని, ఆయన త్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడిందని కొనియాడారు.






