అప్పుడు రక్తాలు పారితే.. ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి

by Thanuru Gopichand |

పల్నాడు ప్రాంతంలో హత్యా రాజకీయాలు చేశారు.

అప్పుడు రక్తాలు పారితే.. ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి
X

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు ప్రాంతంలో వైసీపీ (YCP) హయాంలో రక్తాలు పారితే టీడీపీ (TDP) హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కి జగన్ నేతృత్వంలోని వైసీపీ కి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అని ఆరోపించారు. కానీ టీడీపీ అలా కాదన్నారు. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నందుకే ఆ పార్టీని ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారన్నారు. అయినా కూడా వైసీపీకి బుద్ది రాలేదని విమర్శించారు.

ఎక్కడ ఎవరు చనిపోయినా శవ రాజకీయాల కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్య పెట్టాలని వైసీపీ చూస్తోందన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. అక్రమ సంపాదన మీద పుట్టిన వైసీపీకి, తెలుగువాడి అత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం కి మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా కఠినంగా అణచివేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్న 5ఏళ్ళు జగన్ పల్నాడు లో హింసను ప్రేరేపించాడన్నారు. పల్నాడు లో తెలుగుదేశం నేతల పరామర్శకు చంద్రబాబు వెళ్లకుండా ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారన్నారు. యరపతినేని నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో300మంది ఊరు విడిచి వెళ్లిపోయేలా చేశారని పేర్కొన్నారు. ఒక్క గురజాల నియోజకవర్గంలోనే ఎస్సీ, బీసీలను 12మందిని చంపేశారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ గుంటల్లో పిల్లలు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తప్పు చేసిన ఎవర్నీ వదిలిపెట్టదని ఖరాఖండిగా చెప్పారు. వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చే కుట్రలు ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Next Story