తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ట్రయన్ రన్ విజయవంతం

by Thanuru Gopichand |

తుంగభద్ర డ్యామ్ భద్రతకు ప్రభుత్వ ప్రాధాన్యం.

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ట్రయన్ రన్ విజయవంతం
X

దిశ, వెబ్ డెస్క్ : తుంగభద్ర డ్యామ్ (Tungabadra Dam) భద్రత దిశగా మరో కీలక ముందడుగు పడింది. గతేడాది ఆగస్టులో 19వ నంబరు క్రస్ట్‌గేటు చైన్‌లింక్‌ తెగిపోయి కొట్టుకుపోయిన ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం, అధికారులు ప్రాజెక్టులోని మొత్తం 33 గేట్లను మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం 18వ నంబరు కొత్త గేటును విజయవంతంగా ఏర్పాటు చేసి, ట్రయల్‌రన్‌ను పూర్తి చేశారు. సుమారు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో 49.5 టన్నుల బరువున్న ఈ భారీ గేటును 35 రోజుల వ్యవధిలో అమర్చారు. తొలి దశలో ఒక కొత్త గేటు విజయవంతంగా పని చేయడంతో డ్యాం ఇంజనీర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

​ప్రాజెక్టు డిజైన్ ప్రకారం గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు కాగా.. అవి సుమారు 70 ఏళ్ల పాటు సేవలందించాయి. అయితే ఇటీవల గేట్ల భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో, నిపుణుడు కన్నయ్యనాయుడు సూచనల మేరకు కేంద్ర జలసంఘం (CWC) మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) పర్యవేక్షణలో గేట్ల సామర్థ్యాన్ని పరీక్షించారు. రూ. 44 కోట్ల అంచనా వ్యయంతో గుజరాత్‌కు చెందిన ‘హార్డ్‌వేర్‌ టూల్స్‌’ సంస్థ ఈ 33 కొత్త గేట్ల ఏర్పాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది మే నెలాఖరులోగా మొత్తం గేట్ల ఏర్పాటును పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేశారు.

​సోమవారం సాయంత్రం బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ట్రయల్ రన్‌లో కొత్త గేటును 20 అడుగుల మేర పైకి ఎత్తి మళ్లీ దించారు. ఇప్పటికే మరో మూడు గేట్ల పనులు సగం వరకు పూర్తయ్యాయని, ప్రస్తుత సీజన్‌లోనే 33 గేట్లనూ బిగిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీర్లను ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం 23 గేట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి డ్యాం భద్రతను పటిష్టం చేస్తామని నిపుణులు పేర్కొన్నారు.

Next Story